BULLET TRAIN: హైదరాబాద్‌కు దూసుకొస్తున్న బులెట్ ట్రైన్

కేంద్ర బడ్జెట్ 2026లో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాధాన్యం ఇచ్చింది. నగరాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీ ద్వారా ఆర్థిక వృద్ధిని మరింత ఉద్ధీపన చేయాలన్న లక్ష్యంతో ఏడు కొత్త హై-స్పీడ్ రైల్ కారిడార్లను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే దేశ రైల్వే వ్యవస్థలోనే కాకుండా వ్యాపారం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ ఆర్థిక మంత్రి, “హై-స్పీడ్ రైల్ కారిడార్లు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తాయి” అని తెలిపారు. ముఖ్యంగా మెట్రో నగరాలు, ఆర్థిక కేంద్రాల మధ్య వేగవంతమైన రవాణా సదుపాయాలను అందించడం ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆమె వివరించారు.
అపార ఉద్యోగావకాశాలు
ఈ హై-స్పీడ్ రైలు కారిడార్లు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు, వ్యాపారం, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాల పెరుగుదలకు దోహదపడతాయని తెలిపారు. ముఖ్యంగా మెట్రో నగరాలు, ఆర్థిక కేంద్రాల మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యమని చెప్పారు. దీనిలో భాగంగా.. 7 నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఇవి నగరాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు దోహదం చేస్తాయని తెలిపారు. దేశంలో 7 నగరాలను కలుపుతూ వేస్తోన్న ఈ హైస్పీడ్ రైలు కారిడార్‌లో హైదరాబాద్‌ను మూడు కారిడార్లు కలుస్తాయి. ఈ రైలు కారిడార్లు అమలులోకి వస్తే.. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా అందడమే కాకుండా.. లాజిస్టిక్స్ రంగానికి కూడా బలమైన మద్దతు లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది
ఈ హై-స్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణ దశలోనే కాకుండా, అవి పూర్తయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ఆర్థిక మంత్రి తెలిపారు. నిర్మాణ పనుల కోసం ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, కార్మికులు అవసరం అవుతారు. అలాగే ఆపరేషన్, నిర్వహణ దశలో కూడా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. ఈ ప్రాజెక్టుల చుట్టూ కొత్త వ్యాపారాలు, సేవా రంగాలు అభివృద్ధి చెందే అవకాశముంది. హోటళ్లు, రవాణా సేవలు, రియల్ ఎస్టేట్ రంగాలు ఈ కారిడార్ల వెంట వేగంగా ఎదగనున్నాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. బడ్జెట్ 2026లో ప్రకటించిన ఈ ఏడు హై-స్పీడ్ రైల్ కారిడార్లు దేశ రవాణా రంగంలో ఒక కొత్త యుగానికి నాంది పలుకుతాయని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టులు భారత్ ఆర్థిక ప్రగతికి ప్రధాన చోదక శక్తిగా మారనున్నాయని కేంద్ర ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
