IND VS BAN: మరింత ముదిరిన బంగ్లా-భారత్ వివాదం

భారత్-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు క్రికెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజూర్ రెహమాన్‌ను రిలీజ్ చేయడంతో ఈ పరిణామాలకు మరింత ఆజ్యం పోసింది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌లో నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ముస్తాఫిజూర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. చివరకు బీసీసీఐ సూచనలతో కేకేఆర్ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. ఐపీఎల్ 2026 కాంట్రాక్ట్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించాలని బీసీసీఐ కోరడంతో, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మరో కీలక అడుగు వేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌ల వేదికలను మార్చాలని ఐసీసీ ని కోరాలని నిర్ణయించుకుంది. షెడ్యూల్ ప్రకారం, బంగ్లాదేశ్ జట్టు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్ (ఫిబ్రవరి 7, 2026), ఇటలీ (ఫిబ్రవరి 9), ఇంగ్లాండ్ (ఫిబ్రవరి 14) తో పాటు ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేపాల్ (ఫిబ్రవరి 17) తో ఆడాల్సి ఉంది.
“ముస్తాఫిజుర్ విడుదల అనేది వారి అంతర్గత విషయం, దానిపై నేను వ్యాఖ్యానించలేను. కానీ ప్రపంచకప్ అనేది ఐసీసీ ఈవెంట్. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఐసీసీయే తుది నిర్ణయం తీసుకుంటుంది,” అని బీసీబీ అధికారి ఒకరు తెలిపారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ తమ దేశానికి రావడానికి నిరాకరించడంతో, పాకిస్తాన్ కూడా భారత్‌లో ఆడేందుకు ఇష్టపడటం లేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఐసీసీకి బంగ్లాదేశ్
2026 టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లా.. భారత్‌లో ఆడాల్సిన మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు తరలించాల్సిందిగా ఐసీసీని అభ్యర్థించాలని సూచించింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ధ్రువీకరించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కి అధికారికంగా తెలియజేయాలని, టోర్నమెంట్లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు ప్రత్యామ్నాయ వేదికగా శ్రీలంకను ప్రతిపాదించాలని తాత్కాలిక ప్రభుత్వం బీసీబీని ఆదేశించినట్లు నజ్రుల్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు. ‘క్రీడా మంత్రిత్వ శాఖకు ఇన్చార్జ్ సలహాదారుగా, ఈ మొత్తం విషయాన్ని లిఖితపూర్వకంగా ఐసీసీకి వివరించాలని క్రికెట్ కంట్రోల్ బోర్డుని ఆదేశించాను. ఒక బంగ్లాదేశ్ క్రికెటర్ (ముస్తాఫిజుర్ రెహమన్)తో కాంట్రాక్ట్ పొందినప్పటికీ భారత్‌లో (ఐపీఎల్) ఆడలేకపోతే.. టీ20 ప్రపంచ కప్ ఆడటానికి బంగ్లాదేశ్ జాతీయ జట్టు భారత్‌కు ప్రయాణించడం సురక్షితంగా ఉండదని బోర్డు స్పష్టం చేయాలి. ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని అధికారికంగా అభ్యర్థించాలని ఆదేశించాను’ అని నజ్రుల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
