Gold price: కేంద్ర బడ్జెట్ ముందు వెలవెల పోయిన బంగారం,వెండి రేట్లు.

బడ్జెట్ రోజున సాధారణంగా మార్కెట్లు ఊగిసలాటలో ఉంటాయి, కానీ ఈసారి బంగారం, వెండి ధరలు పాతాళానికి పడిపోవడం ఇన్వెస్టర్లను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆదివారం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 1.4 లక్షలకు పడిపోగా, వెండి కిలోకు రూ. 2.74 లక్షల స్థాయికి చేరుకుంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వెండి ధర రికార్డు గరిష్టాల నుంచి సుమారు 35-37 శాతం పతనం కావడం గమనార్హం.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా 'హాకిష్' (కఠిన నిర్ణయాలు తీసుకునే) వ్యక్తిని డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేయబోతున్నారనే వార్తలు అంతర్జాతీయంగా డాలర్ విలువను పెంచాయి. దీంతో బంగారంపై పెట్టుబడులు ఒక్కసారిగా వెనక్కి వెళ్లాయి. బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 4 శాతానికి తగ్గించే అవకాశం ఉందనే ప్రచారం వ్యాపారుల్లో ఆందోళన కలిగించింది. ఒకవేళ సుంకం తగ్గితే, దేశీయంగా ధరలు మరో రూ. 3,000 వరకు తగ్గే అవకాశం ఉండటంతో ట్రేడర్లు భారీగా విక్రయాలకు పాల్పడ్డారు. జనవరి నెలలో బంగారం, వెండి ధరలు అసాధారణంగా పెరగడంతో, ఇన్వెస్టర్లు తమ లాభాలను నగదు రూపంలోకి మార్చుకునేందుకు పోటీ పడ్డారు.
ప్రస్తుతం MCXలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.13,711 తగ్గి, రూ.1,38,634కు చేరింది. ఇక కిలో వెండి ధర రూ. 26,273 తగ్గి, రూ. 2,25,652గా ఉంది. శుక్రవారం ధరలు 12 శాతం పడిపోయాయి. ఒకానొక దశలో వెండి 37 శాతం కుప్పకూలాయి. 1980 తర్వాత బంగారం ధరలు ఒకే రోజు ఇంతలా పడిపోవడం ఇది మొదటిసారి. వెండి ధరలు చరిత్రలోనే అతిపెద్ద క్షీణతగా రికార్డ్ నమోదైంది.
బంగారం, వెండి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా ఈ పతనం నుంచి తప్పించుకోలేకపోయాయి. శుక్రవారం, ఆదివారం కలిపి చాలా వరకు ఈటీఎఫ్‌లు 15 నుంచి 20 శాతం వరకు నష్టపోయాయి. దీనివల్ల రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. అయితే, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఆందోళన చెందవద్దని, ఇది కేవలం ఒక సరిదిద్దే ప్రక్రియ మాత్రమేనని నిపుణులు సూచిస్తున్నారు.
ధరల పతనం సామాన్యులకు ఒక విధంగా శుభవార్తే. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో బంగారం ధరలు తగ్గడం ఊరటనిస్తుంది. ఒకవేళ నిర్మలమ్మ బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని నిజంగానే తగ్గిస్తే, నగల దుకాణాలు మళ్లీ కస్టమర్లతో కళకళలాడే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
