JOGI: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ దాడి.. ఇంటికి నిప్పు

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి **నారా చంద్రబాబు నాయుడు**పై చేసిన అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై అధికార తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఫలితంగా రాజకీయ విమర్శలు హింసాత్మక ఘటనలుగా మారి, శాంతి భద్రతలపై ఆందోళన కలిగించే పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారం ఇంకా చల్లారకముందే, మరో మాజీ మంత్రి జోగి రమేష్కు సంబంధించిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. మంత్రి నారా లోకేశ్పై జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటిని పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ, పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. టీడీపీ శ్రేణులు జోగి రమేష్ నివాసంపై దాడికి పాల్పడి, ఇంటికి నిప్పు పెట్టినట్లు సమాచారం. ఈ ఘటన సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఆయన తండ్రి, భార్య ఉన్నారని తెలుస్తోంది. జోగి రమేష్ మాత్రం తంబళ్లపల్లె ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఈ దాడితో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
టీడీపీ వర్గాలు మాత్రం తమ నాయకత్వంపై వ్యక్తిగత దూషణలు సహించబోమని స్పష్టం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు మరోవైపు, అరెస్టులు, దాడులను రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తున్నారు. ఈ పరస్పర ఆరోపణలతో రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
